: కంగారులో ఏకంగా పోలీస్ స్టేషన్లోనే దూరిన దొంగ..!
దొంగలు పరుగులు తీస్తూ చివరికి పోలీస్ స్టేషన్లోకి వెళ్లిపోవడం... ఆపై పోలీసులు వారిని తాపీగా అరెస్టు చేయడం.. వంటి సన్నివేశాలను ఎన్నో సినిమాల్లో చూసి హాయిగా నవ్వుకున్నాం. అయితే, ఇటువంటి ఘటనే చైనాలోని షెన్జెన్ పట్టణంలో నిజంగా చోటుచేసుకుంది. రోడ్డు దాటేందుకు సిద్ధంగా ఉన్న ఒక యువతిని గమనించిన ఓ దొంగ ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను చూశాడు. దాన్ని లాక్కొని ఎవరికీ దొరకకుండా దూరంగా పారిపోయి ఎక్కడయినా తల దాచుకోవాలనుకున్నాడు.
వెంటనే సెల్‌ఫోన్ లాక్కుని పరుగులు తీశాడు. అయితే, ఆ యువతి 'దొంగ దొంగ' అంటూ అరుస్తూ అతడి వెంటపడింది. ఈ క్రమంలో ఆమె ఒకసారి రోడ్డుపై పడిపోయింది. అయినప్పటికీ లేచి దొంగను వెంటాడుతూ తన సెల్‌ఫోన్ కోసం పరుగులు తీసింది. దీంతో ఆమె ఎక్కడ పట్టేసుకుంటుందో అన్న భయంతో కంగారుపడిన సదరు దొంగ.. ఆ హడావిడిలో .. ఎకాఎకీన వెళ్లి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో దూరాడు. ఆ దొంగ వెంట పరుగులు తీసిన యువతి కూడా అక్కడికే చేరి ... జరిగినదంతా అక్కడి పోలీసుకు చెప్పడంతో దొంగను అరెస్టు చేశారు.