: విజయవాడలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యం.. ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకుతున్నానంటూ వాట్సాప్ మెసేజ్!
విజయవాడలో నాగసాయి (25) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యమయ్యాడు. హైదరాబాదులోని సీజీఐ సంస్థలో అతను పని చేస్తున్నాడు. ఈ నెల ఆరో తారీఖున అతను విజయవాడకు వచ్చాడు. శనివారం రాత్రి ఏడు గంటలకు బైక్ పై బయటకు వెళ్లిన ఆయన... తన కుటుంబానికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాడు. తాను ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకి చనిపోతున్నానని... తన శరీరాన్ని కృష్ణా నదిలో నుంచి తీసుకోవాలని మెసేజ్ చేశాడు.
దీంతో, అతని కుటుంబ సభ్యులు హుటాహుటీన పోలీసులను ఆశ్రయించారు. అయితే, నదిలో ఇంత వరకు అతని మృతదేహం లభ్యంకాలేదు. నాగసాయి విపరీతమైన పని ఒత్తిడికి గురవుతున్నాడని... అందుకే ప్రశాంతత కోసం తిరుపతి కూడా వెళ్లి వచ్చాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు నాగసాయి ఫేస్ బుక్ అకౌంట్ లైవ్ లోనే ఉందని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం వెనుక ప్రేమ కోణం ఏమైనా ఉందా? అనే దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.