: బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వడం ఎలా సాధ్యం?: చంద్రబాబు
మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో, ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పుగోదావరి జిల్లా నేతలతో చంద్రబాబు నిన్న రాత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బుచ్చయ్య హజరుకాకపోయినా... చంద్రబాబు మాత్రం ఆయన గురించి మాట్లాడారు. మంత్రి పదవి ఇవ్వలేదంటూ బుచ్చయ్య చౌదరి రచ్చ చేయడం సరికాదని... ఇప్పటికే ఆయన సామాజికవర్గానికి చెందినవారు చాలా మంది మంత్రివర్గంలో ఉన్నారని... ఇలాంటి పరిస్థితిలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ విషయం బుచ్చయ్య చౌదరికి కూడా తెలుసని... అయినా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, పార్టీ పరువును బజారుకు ఈడ్చారని అసంతృప్తిని వ్యక్తం చేశారు.