: స్వాతంత్ర్యానికి పూర్వమే తిరిగిన 'కేశినేని' బస్సు... ఇక కనిపించదు!
దాదాపు 9 దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించిన కేశినేని ట్రావెల్స్ ఇక కనిపించదు. భారతావనికి స్వాతంత్ర్యం రాకపూర్వమే ఏర్పడిన ఈ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వహిస్తున్న కార్యాలయాలు నేడు మూతబడ్డాయి. గత రెండు వారాలుగా ఒక్కో బస్సు సర్వీసునూ తగ్గిస్తూ వచ్చామని, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయాలను చూపామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. వివిధ మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు, ఇతర ట్రావెల్స్ లో ప్రయాణానికి అవకాశం కల్పించామని వెల్లడించారు.
కాగా, కేశినేని ట్రావెల్స్ బస్సులు విజయవాడ నుంచి గుంటూరు, తెనాలి మధ్య తొలినాళ్లలో తిరిగాయి. ఆపై ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఓ దశలో 150కి బస్సులను వివిధ మార్గాల్లో నిర్వహించే స్థాయికి చేరుంది. ఇటీవలి కాలంలో నష్టాలు పెరగడంతోనే సంస్థను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే.