: ఏపీ ఇక సంతోషాంధ్రప్రదేశ్.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వెలగపూడిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 54 పట్టణాల్లో 222 ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల’ను డిజిటల్ ఓపెనింగ్ విధానం ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రులు అనారోగ్యానికి కేరాఫ్‌గా ఉండేవన్నారు. కోట్ల రూపాయల విలువైన పరికరాలను ఉపయోగించుకోకుండా మూలన పడేశారని అన్నారు. ఇక ఆ దుస్థితి ఏ ఆస్పత్రిలోనూ కనిపించదని, అన్ని ఆస్పత్రులను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఆదివారం సహా ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో పనిచేస్తాయని, రోగులు గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండదన్నారు. ఏసీ గదుల్లో చికిత్స లభిస్తుందని అన్నారు.
రక్త, మూత్ర, మలేరియా, డెంగీ స్క్రీనింగ్, ఈసీజీ లాంటి 30 పరీక్షలను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో చేయించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. ఈ-ఔషధి ద్వారా పట్టణాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ధనుష్ హెల్త్‌కేర్ ద్వారా విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో 58 కేంద్రాల్లో, మిగిలిన 9 జిల్లాల్లోని 164 సీఎం ఆరోగ్య కేంద్రాల్లో అపోలో హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఒక్కపూట అన్నం పెడితే ‘అన్నదాత సుభీభవ’ అని దీవిస్తారని, ఇన్ని పథకాలను ప్రారంభిస్తున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలు మరింత ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.