: ట్రంప్ చేసిన ఎటాక్ ఉగ్రవాదులకు మద్దతుగానా?
అంతర్జాతీయంగా సిరియాలో అమెరికా చేసిన క్షిపణిదాడిపై చర్చ జరుగుతోంది. సిరియాలో అంతర్యుద్ధం చాలా కాలంగా సాగుతోంది. ఈ క్రమంలో సిరియాలోని మెజారిటీ ప్రాంతాలను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకుని, అక్కడి నుంచి షరియత్ అమలు చేయాలంటూ సొంత పరిపాలన సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరమేధానికి తెగబడ్డారు. వివిధ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ తమ సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నారు. రాచరికపు రోజులను గుర్తుతెస్తూ మతగ్రంథాల్లో ఉన్న పాలనకు తెరతీశారు. దీంతో అమెరికా సైన్యం ఇరాక్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు, రష్యా సిరియా సైన్యానికి మద్దతుగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించాయి. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్ పుంజుకునేందుకు అమెరికాయే కారణమంటూ...అమెరికాకు ఐఎస్ఐఎస్ సరఫరా చేస్తున్న చమురు గురించి రష్యా బయటపెట్టింది.
అనంతరం సిరియాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది కూడా చివరి దశకు చేరుకుంది. ఐఎస్ఐఎస్ చీఫ్ బగ్దాదీ సిరియా నుంచి తప్పించుకునేందుకు 17 వాహనాలతో ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసి, తప్పించుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సిరియా ప్రభుత్వం అమాయకులపై రసాయన ఆయుధాలతో దాడి చేసిందని ఆరోపిస్తూ సిరియాకు చెందిన వైమానిక స్థావరాన్ని అమెరికా తుదముట్టించింది. సిరియాలో బోలెడు వైమానిక స్థావరాలున్నప్పటికీ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను తుదముట్టించడంలో కీలక పాత్రపోషించే అసద్ అల్ బషర్ వైమానిక స్థావరం ప్రధానమైనది.
ఈ వైమానిక స్థావరం నుంచే సిరియా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. దీంతోనే వారు తోకముడిచారు. తమ బలగాలను సంరక్షిస్తూ, దాడులు చేసేందుకు ఈ వైమానిక స్థావరం సిబ్బంది విజయం సాధించారు. అలాంటి కీలకమైన వైమానిక స్థావరాన్ని అమెరికా కూల్చివేసింది. మధ్యధరా సముద్రంలోని షిప్ నుంచి సుమారు 60 తోమహాక్ క్షిపణులను ప్రయోగించి ఈ వైమానిక స్థావరాన్ని అమెరికా నాశనం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు వైమానిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఎస్ఐఎస్ కు మద్దతుగా అమెరికా దాడి చేసినట్టు ఉందని పలువురు పేర్కొంటున్నారు.