: అశోక్ గజపతిరాజు చాలా సౌమ్యుడు..శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించడం విచారకరం: తులసిరెడ్డి
కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు చాలా సౌమ్యుడని, అటువంటి వ్యక్తిపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించడాన్ని చూస్తుంటే, తన కేబినెట్ పై ప్రధాని మోదీకి పట్టు లేదనిపిస్తోందని విమర్శించారు.
దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీలపై లోక్ సభ స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయాన్ని కూడా తులసిరెడ్డి ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపులకు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పూర్తి వ్యతిరేకి అని గుర్తు చేశారు. కానీ, అందుకు భిన్నంగా నేడు టీడీపీ ప్రవర్తిస్తోందని తులసిరెడ్డి దుయ్యబట్టారు.