: ఈ జాతీయ అవార్డు తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తోన్న గౌరవంగా భావిస్తున్నా: ‘శతమానం భవతి’ దర్శకుడు
ఈ రోజు ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రం శతమానం భవతికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న మీడియాతో మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేశారు. తమ సినిమాకు వచ్చిన ఈ అవార్డును తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తోన్న గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. శతమానం భవతి సినిమా కోసం తాము పడ్డ కష్టానికి గౌరవం దక్కిందని, తెలుగు సంప్రదాయాలు కలబోసి ఈ సినిమాని నిర్మించామని, ప్రేక్షకుల నుంచి అద్భుతంగా స్పందన వచ్చిందని చెప్పారు. ప్రతి తెలుగు కుటుంబం ఇది మా కథ, మా ఇంటి కథ అని చెప్పుకునేట్లు నిర్మించామని అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సినిమాను తీశామని, నిర్మాత దిల్ రాజు తనపై ఎంతో నమ్మకం ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు .