: గోవాలో లైంగిక వేధింపులు.. ఇబ్బందుల్లో బాలీవుడ్ సినీ దర్శకుడు
జాతీయ అవార్డు అందుకున్న సినీ దర్శకుడు వికాస్ బెహల్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. 'క్వీన్' చిత్రంతో ఆయన విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి బెహల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ... ఆయనకు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు పనిచేసిన యువతి ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో వికాస్ ఒకరు.
గోవా పర్యటన సందర్భంగా తనతో వికాస్ చాలా దారుణంగా ప్రవర్తించాడని సదరు యువతి తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుల దృష్టికి తీసుకెళ్లి, తనకు న్యాయం చేయాలని కోరినట్టు వెల్లడించింది. అయితే, వికాస్ గత నెల 28 నుంచి ఆఫీసుకు రావడం లేదని, తన బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడని ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో, ఈ ఘటనపై వికాస్ బెహల్ స్పందించాడు. ఆమె తమ సంస్థలో పని చేస్తున్న యువతి కాదని చెప్పాడు. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని... ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాననే వార్తల్లో వాస్తవం లేదని తెలిపాడు. గోవాలో ఆమెతో కలసి పని చేసిన మాట వాస్తవమేనని, అయితే ఏ క్షణంలోనూ హద్దుమీరి ప్రవర్తించలేదని చెప్పాడు. ఒకవేళ తాను ఆమెను గాయపరిచినట్టు భావిస్తుంటే, ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.