: ఏకాంత జీవితాన్ని ప్రసాదించాలంటున్న లాడెన్ పొరుగువారు!


రెండు సంవత్సరాల కిందట ఇస్లామాబాద్ లోని అబట్టోబాద్ సైనిక అకాడమీ సమీపంలో ఓ భవనంలో ఉంటున్న అల్ ఖైదా అధ్యక్షుడు ఓసామా బిన్ లాడెన్ ను అమెరికా కమెండోలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడెందుకు ఆ ఘటన గురించి చెబుతున్నారని అనుకోవచ్చు. ఆనాటి ఘటనకు సంబంధించి ఇప్పటికీ అబట్టోబాద్ లో లాడెన్ భవనం ఇరుగు పొరుగువారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

మీడియా వాళ్ళే కాకుండా, దారిన పోయే దానయ్యలు కూడా వారిని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ వేధిస్తున్నారట. దాంతో విసిగిపోయిన ఇక్కడి జనం తమకు ఏకాంత జీవితం ప్రసాదించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మే 2, 2011న నాడు పక్కా వ్యూహంతో యూఎస్ కమెండోలు, నేవి సీల్స్ సంయుక్తంగా లాడెన్ ను హతమార్చాయి. ఆరోజు ఆ ఘటన జరుగుతుందని, అక్కడ ఒసామా ఉంటాడని చుట్టుపక్కల ఎవరికీ తెలియదు.

కానీ, తెల్లవారి లేచి చేస్తే పక్కన భవనంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. అప్పుడే వారికీ విషయం తెలిసింది. అప్పటివరకు ఆ భవనంలో లాడెన్ ఉన్నాడని. అది తెలిసి వామ్మో అనుకున్నారు. అనంతర కాలంలో పలు టీవీ ఛానెళ్లు వీరందరిని పలు ప్రశ్నలతో ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు వందలాది జర్నలిస్టులు తమను ఆనాటి ఘటనపై ఇంటర్వ్యూలు చేశారనీ, మరి కొంతమంది దాడి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారనీ 19 ఏళ్ల సైముల్లాహ్ అనే యువకుడు 'చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా'కు తెలిపాడు.

ఆ ఘటన తమ రోజువారీ జీవితాన్ని అత్యంత ఇబ్బందికరంగా మార్చిందని, దానివల్ల జీవితంలో ప్రశాంతతను కోల్పోయామనీ ఈ అబ్బాయి అంటున్నాడు. ప్రతిసారీ మీడియా వాళ్ళు లాడెన్ గురించి అడిగిన ప్రశ్నలనే అడుగుతున్నారన్నాడు. అయితే, తామెప్పుడూ అతన్ని చూడలేదని ఈ బాలుడు చెబుతున్నాడు. ఇది తన కళాశాల చదువుపై కూడా ప్రభావితం చూపిందని చెప్పాడు. ఆరోజు బాగా చీకటి పడ్డాక శబ్దాలు వినిపించాయని, తర్వాత భారీ పేలుడు సంభవించిందని పేర్కొన్నాడు. అయినా ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, ఉదయం టీవీ ద్వారానే ఒసామా మరణించాడని తెలుసుకున్నామని సైముల్లాహ్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.

దీనిపైనే, లాడెన్ భవనానికి దగ్గర్లో ఉన్న 84 సంవత్సరాల జయీన్ మహ్మద్ వివరిస్తూ..తమ ఇళ్ళ పక్కనే లాడెన్ ను హతుడవడం తమకు ఒక చెడ్డ అనుభవమన్నాడు. ఈ విషయంలో తనను, తన కుమారుడు, మరో ముగ్గురు చుట్టుపక్కల వారిని 17 రోజుల పాటు భద్రతా దళాలు నిర్భందించాయని వెల్లడించారు. కాకపోతే వీరిపై నేరారోపణలు మోపలేదు. ఆ సంఘటన తమ జీవితంలో ఓ చీకటి క్షణమని జయీన్ చెప్పారు.

యూఎస్ సైనికుల చేతిలో ఒసామా మరణించాడన్న వార్తను జయీన్ వంటి పాకిస్తానీయులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళూ తమపక్క ఇంటిలో ఉన్నది ఒసామానా? లేక వేరెవరైనానా? అన్నది తమకు ఇప్పటికీ తెలియదని, ఇద్దరు పాకిస్థానీ సోదరులు పక్కపక్కనే ఉంటున్నారని మాత్రమే అనుకున్నామని మరింత వివరించాడు.

వాస్తవానికి, ఇక్కడి చాలామంది ప్రజలకి ఒసామా గురించి అంతగా తెలియదు. అంతేకాదు అతని గురించి మాట్లాడటానికి కూడా వారు అంగీకరించడంలేదు. అతన్ని తాము టీవీలోనే చూశామనీ, అంతకంటే ముందు విడిగా ఎక్కడా చూడలేదనీ అంటున్నారు. ఒసామాపై మహ్మద్ లతీఫ్ అనే స్కూల్ టీచర్ మాట్లాడుతూ.. ఒసామా ఓ పెద్ద కనస్ట్రక్షన్ కంపెనీకి యజమాని అని తనకు తెలుసన్నాడు. ముస్లీంలు అతన్ని బాగా ఇష్టపడతారని, కానీ, పశ్చిమ దేశాలు, అమెరికాతో లాడెన్ కు కొన్ని విభేదాలున్నాయని చెప్పాడు.

ఇక అబట్టోబాద్ లోని లాడెన్ నివసించిన భవనం ప్రస్తుతం పూర్తిగా గడ్డితో కప్పబడి, పాతబడిపోయింది. ఓ విధంగా ఆ ప్రాంతం ప్రాముఖ్యత కోల్పోగా, పలువురు స్థానికులను మాత్రం ఆకర్షిస్తోంది. కొంతకాలం కిందట ఆ భవనం ఉన్న స్థలాన్ని 'వినోద పార్కు'గా మార్చాలని పాక్ వాయువ్య ప్రావిన్స్ పర్యాటక శాఖ ప్రతిపాదించింది. అనంతరం దానివైపే కన్నెత్తి చూడలేదు. కానీ, అక్కడ 'వినోద పార్కు' లాంటివి నిర్మించడం చాలా ప్రమాదకరమని జిన్హువా ఏజెన్సీ హెచ్చరిస్తోంది. ఎందుకంటే తమ గురువు నివసించిన ప్రాంతంలో అలాంటివి పెట్టాలనుకుంటే అల్ ఖైదా మిలిటెంట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారని పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News