: పార్లమెంటులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు: సుమిత్రా మహాజన్ వివరణ
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విషయంలో శివసేన దురుసుగా ప్రవర్తించలేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. పార్లమెంటులో శివసేన ఎంపీలు అశోక్ గజపతిరాజును రౌండప్ చేయడం పట్ల ఆమె వివరణ ఇస్తూ, పార్లమెంటులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం సర్వసాధారణమని అన్నారు. వెల్ లోకి దూసుకురావడం, సీట్ల దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సర్వసాధారణమని ఆమె చెప్పారు.
ఆ వెంటనే తాను సభను వాయిదా వేశానని, దాని తరువాత అశోక్ గజపతిరాజు, శివసేన ఎంపీలు బాగానే మాట్లాడుకున్నారని ఆమె సమస్యను తేలిక పరిచారు. అనంతరం రవీంద్ర గైక్వాడ్ వివాదంపై ఆమె మాట్లాడుతూ, వివాదాన్ని పొడిగించడం మంచిది కాదని చెప్పారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె చెప్పారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టే ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. కమిటీ కూడా వేస్తామని, కమిటీ ఏం చెబుతుందో చూసిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆమె అన్నారు.