: మంత్రులు కాలేకపోయిన వారికి కీలక పదవులు కట్టబెట్టనున్న చంద్రబాబు... దాదాపు ఫైనల్ అయిన పేర్లివి!
రెండు రోజుల క్రితం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో పదవులు పొందలేకపోయిన వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఇందులో భాగంగా మండలిలో ఖాళీగా ఉన్న కీలక పదవులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను నేతలకు కట్టబెట్టే దిశగా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆశావాహుల్లో అసంతృప్తిని తొలగించేందుకు ఇప్పటికే పలువురి పేర్లను వివిధ పదవులకు చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం. మంత్రివర్గంలో 26 మందికి మించి చోటు కల్పించలేని పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఇతర నేతలకు మండలిలో త్వరలో ఖాళీ అయ్యే పలు పదవులను ఇవ్వనున్నారు.
మేలో శాసనమండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. భూమా వర్గానికి ఓ మంత్రి పదవి ఇవ్వడం, శాసనసభకు ఆంధ్రా ప్రాంత నేత సభాపతిగా ఉండటంతో, మండలి పదవిని రాయలసీమకు చెందిన శిల్పాకు ఇస్తే సమస్య ఉండదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మండలి చీఫ్ విప్ పదవిని పయ్యావుల కేశవ్ కు ఇచ్చి, అయనకు క్యాబినెట్ హోదాను కల్పించాలని, రెండు, మూడు విప్ పదవులకు అన్నం సతీశ్, బుద్ధా వెంకన్న, బీద రవిచంద్ర, యలమంచిలి బాబూరాజేంద్ర ప్రసాద్, చిక్కాల రామచంద్రరావు తదితరుల పేర్లను ఆయన తుది దశ వడపోతలో పరిశీలిస్తున్నారు.
ఇక మేలోనే గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి వుంది. వీటిల్లో ఒకటి కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారైపోయింది. రెండో స్థానానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకున్నందున ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే విషయమై, మేలో జరిగే మహానాడులో నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్సీలుగా కూడా ఎంపిక చేయలేకపోయిన వారిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు కార్పొరేషన్లతో పాటు ఆలయ కమిటీలను భర్తీ చేస్తే, తృతీయ శ్రేణి నాయకుల వరకూ అందరినీ సంతృప్తి పరచవచ్చని, ఈ ప్రక్రియను వచ్చే నాలుగైదు నెలల్లో పూర్తి చేసి ఆపై 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలన్నది చంద్రబాబు అభిమతంగా టీడీపీ నేతలు చెబుతున్నారు.