: ఎందుకు కక్ష కట్టారో తెలియదు... నాకిచ్చిన కోటింగ్ వల్లే కాళ్లు చచ్చుపడిపోయాయి: సత్యంబాబు
పోలీసులు తనపై ఎందుకు కక్షకట్టారో తెలియదని ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ఒక కేసులో విడుదలైన 18 రోజులకే ఆయేషా మీరా హత్య కేసులో మళ్లీ తనను అరెస్టు చేశారని అన్నాడు. జైలు నుంచి విడుదలైన తరువాత ఒక కానిస్టేబుల్ తన దగ్గరకి వచ్చి, 'సత్యంబాబు, జైలు నుంచి ఎప్పుడు వచ్చావు?' అని అడిగారని, 'నాలుగు రోజులైంది సార్ వచ్చి' అని చెప్పానని, అయితే ఆయన 'నువ్వు అమ్మాయిల హాస్టల్ కి వెళ్లి అమ్మాయిలతో తప్పుడు నడత నడుస్తున్నావట నిజమా?' అని అడిగాడని .. 'సార్ నాకు చెల్లెలు ఉంది... నాకు హాస్టల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు' అని సమాధానం చెప్పానని, ఆ తరువాత తనను అరెస్టు చేశారని అన్నాడు.
జైలుకి వెళ్లే సమయంలో తాను బాగానే ఉన్నానని, తనకి పోలీసులు ఇచ్చిన కోటింగ్, కౌన్సిలింగ్ వల్లే తనకు జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకిందని చెప్పాడు. వారిచ్చిన కోటింగ్ కి తనలో శక్తి హరించుకుపోయిందని, దీంతో బలహీనమైపోయానని, అనంతరం తనకు జబ్బు సోకిందని వైద్యులు తెలిపారని అన్నాడు. దీంతో తన కాళ్లు చచ్చుపడిపోయాయని అన్నాడు. జైలులో చికిత్స తీసుకున్నానని, దీంతో మళ్లీ తనకు నయమైందని సత్యంబాబు తెలిపాడు. జైలులోని వర్క్ షాపులో పని చేశానని చెప్పాడు.