: మా కోచ్ అలా చేస్తే... చాలా బాధపడిపోయాను: వెంకటేష్
తాను మరీ ఫిట్ నెస్ ఫ్రీక్ ను కాదని ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. అయితే ఫిట్ గా ఉండడానికి కావలసినంత వ్యాయామం చేస్తానని చెప్పారు. ఈ సినిమా కోసం ఆరు నెలలు కష్టపడ్డానని, బాక్సింగ్ కూడా నేర్చుకున్నానని తెలిపారు. యుక్తవయసులో ఉండగా మహ్మద్ అలీ బాక్సింగ్ మ్యాచులన్నీ చూసేవాడనని, ఈ సినిమా కోసం నిజంగా బాక్సర్లనే తీసుకొచ్చామని చెప్పారు. వారి నుంచి కొన్ని సలహాలు తీసుకున్నామని, అంతే కాకుండా తన ఫిట్ నెస్ గురువులు తనపై అనుసరించిన విధానాలను కూడా చూపించానని చెప్పారు.
ఈ సినిమాలో ట్రైనింగ్ సందర్భంగా ఒక ట్రైనీ దగ్గర వాటర్ బాటిల్ ను కాలుతో తంతాను చూశారా, అది తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనేనని వెంకీ చెప్పారు. సినిమాలో తాను కేవలం వాటర్ బాటిల్ నే తన్నానని, తన కోచ్ అయితే ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వాటర్ ఫ్లాస్క్ ను కాలితో నలిపేసి విరగ్గొట్టేశాడని, అప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. తన కోచ్ కి తాను వెంకటేష్ ని కాదని, కేవలం స్టూడెంట్ నేనని, మరీ ఘోరంగా చూసేవారని వెంకీ గుర్తుచేసుకున్నారు.