: ప్రజల పక్షాన నిలబడాల్సిన గవర్నర్ ప్రభుత్వాలకు భజన చేస్తున్నారు!: వీహెచ్
ప్రజల పక్షాన నిలబడాల్సిన గవర్నర్, ప్రభుత్వాలకు భజన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడమంటే రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని వీహెచ్ ప్రశ్నించారు.
ఒక పార్టీ తరఫున గెలిచి, మరో పార్టీలోకి మారడమనేది వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఇలానే చూస్తూ కూర్చుంటే, ఓటర్లు ఎవరూ భవిష్యత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోరని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ ని త్వరలో కలుస్తానని వీహెచ్ చెప్పారు.