: అక్కడ గెలిస్తే మంత్రి పదవి... నక్కాకు కలిసొచ్చిన సెంటిమెంట్!
గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం... 1962లో ఏర్పడ్డ ఈ నియోజక వర్గం నుంచి విజయం సాధించిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఓ సెంటిమెంట్. ఇప్పుడు అదే సెంటిమెంట్ నక్కా ఆనందబాబుకు కలిసొచ్చింది. గతంలో ఇక్కడ గెలుపొందిన వారిలో ఆరుగురు మంత్రి పదవులను అలంకరించగా, వారిలో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. 1962లో గెలిచిన కాంగ్రెస్ నేత కల్లూరి, ఆపై 1967, 1972లో ఇండిపెండెంట్ గా, 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన యడ్లపాటి వెంకట్రావులు మంత్రులుగా పనిచేశారు.
1983లో నాదెండ్ల భాస్కరరావు విజయం సాధించి సీఎం కాగా, 1989లో ఆలపాటి ధర్మారావు గెలిచి మంత్రి అయ్యారు. ఆయనే 1999లోనూ గెలిచి మరోసారి మంత్రిగా పనిచేశారు. 2009లో, ఆపై 2014లో నక్కా ఆనందబాబు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్న వేళ ఆయన చూపిన ఓర్పు, ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత కుల సమీకరణాలు కలసిరావడంతో, వేమూరు సెంటిమెంట్ ఆయనపై పనిచేసింది. నిన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో నక్కాకు పదవి లభించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి తమ ఎమ్మెల్యే మంత్రి అయ్యారని వేమూరు వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.