: స్నేహితురాలితో కనిపించాడని యువకుడికి గుండు కొట్టించిన యూపీ పోలీసులు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల అత్యుత్సాహం పలువురికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తన స్నేహితురాలిని కలిసేందుకు షాజహాన్‌పూర్‌లోని పబ్లిక్ పార్కుకు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, అనంతరం అతడికి దగ్గరుండి గుండు చేయించారు. ముందుగా పార్కులో స్నేహితురాలితో ఉన్న యువకుడి వద్దకు వచ్చిన కానిస్టేబుళ్లు, యువతిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.
అనంతరం ఒక బార్బర్‌ను అక్కడకు పిలిపించి యువకుడికి గుండు చేయించారు. ఆ యువకుడికి గుండు కొట్టించిన కానిస్టేబుళ్లు యాంటీ రోమియో స్క్వాడ్‌కు చెందిన సభ్యులు కాదని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే, సదరు బాధితుడి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ చర్యకు పాల్పడ్డ కానిస్టేబుళ్లపై మాత్రం చర్యలు తీసుకున్నారు.