: మహారాష్ట్రలో 9 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ ఎత్తివేత.. మరో 10 మందిపై కొనసాగింపు


మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల జరిగిన బడ్జెట్ స‌మావేశాల‌ సమయంలో ఆ రాష్ట్ర‌  ప్రతిపక్ష పార్టీల‌కు చెందిన 19 మంది శాసనసభ్యులు స్పీకర్‌ను అగౌరవపరిచేలా ప్రవర్తించడంతో వారిని స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. వారంద‌రినీ తొమ్మిది నెలల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీక‌ర్.. ఈ రోజు వారిలో తొమ్మిది మందికి ఊర‌ట క‌లిగించారు. తొమ్మిది మందిపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలపై ఈ ఏడాది డిసెంబ‌రు వ‌ర‌కు సస్పెన్షన్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు.
 
గ‌త నెల 18న మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్‌ ముంగట్‌వార్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై ప‌లు అభ్యంత‌రాలు చెబుతూ ఆందోళ‌న‌కు దిగిన విప‌క్ష పార్టీల స‌భ్యులు స్పీకర్‌నే అగౌరవపరిచేలా వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌రం బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీ బయట కాల్చి వేశారు. దీంతో స్పీకర్‌ 9 మంది కాంగ్రెస్‌, 10 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News