: నేటితో ముగియనున్న ఎస్‌బీహెచ్ శకం.. గన్‌ఫౌండ్రీలోని చారిత్రక సౌథం పేరు మార్పు!


స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్).. ఏప్రిల్ 5, 1942న నిజాం సంస్థానంలో ప్రారంభమైన ఈ బ్యాంకు శకం నేటితో ముగిసినట్టే. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశల సౌధమైన ఎస్‌బీహెచ్ నేడు (శనివారం) మాతృసంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లో విలీనం కానుంది. లక్షలాదిమంది ఖాతాదారులతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఎస్‌బీహెచ్ నేటితో కొత్త రూపు సంతరించుకోనుంది. నేటికి సరిగ్గా ఏడున్నర దశాబ్దాల క్రితం 1941లో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకు చట్టం కింద దీనిని  నిర్మించారు. ఇండో-యూరోపియన్ నిర్మాణ శైలిలో అత్యద్భుతంగా కట్టారు. దీనికి వారసత్వ భవనంగానూ గుర్తింపు లభించింది. అప్పట్లో రిజర్వు బ్యాంకు బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలో ఉండేది. నిజాం ప్రభుత్వంలో సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు.  

 అప్పటి కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’లో బ్యాంకు కార్యకలాపాలు కొనసాగాయి. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యాక ఈ బ్యాంకుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌’ (ఎస్‌బీహెచ్)గా నామకరణం చేశారు. 1950  నాటికి 50 శాఖలు కలిగిన ఎస్‌బీహెచ్‌కు నేడు 2 వేల బ్రాంచ్‌లు ఉన్నాయి. గన్‌ఫౌండ్రి శాఖలో 20 వేల మంది ఖాతాదారులున్నారు. ఆసియాలోనే అతిపెద్ద లాకర్స్ వ్యవస్థ ఇందులో ఉండడం విశేషం. నేడు ఎస్‌బీహెచ్‌ విలీనం కానుండడంతో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది బ్యాంకు ముందు నిల్చుని సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగడం కనిపించింది.

  • Loading...

More Telugu News