: మంటగలిసిన మానవత్వం... ఆత్మహత్యకు పాల్పడుతుంటే వీడియో తీసింది!
శత్రువైనా 'ప్రాణాలు పోతున్నాయి బాబోయ్.. కాపాడండి' అంటే ఏమాత్రం మానవత్వం ఉన్నా వారిని ఆదుకుంటాం... అయితే ఇంట్లో పనిమనిషి 'చచ్చిపోయేలా ఉన్నాను రక్షించండి' అంటూ అరుస్తున్నా యజమాని వీడియో తీస్తూ మానవత్వం మంటగలిపిన ఘటన కువైట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కువైట్ లో ఓ మహిళ ఇంట్లో ఇథియోపియాకు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆమెకు ఏ కష్టమొచ్చిందో కానీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడో అంతస్తు ఎక్కి దూకేసే ప్రయత్నం చేసింది. అయితే జీవితం మీద ఆశపుట్టిందో ఏమో కానీ... చివరి నిమిషంలో ఆమె ఆత్మహత్యాయత్నం నుంచి విరమించుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే చేయిదాటిపోవడంతో తనను కాపాడాలని కేకలు వేసింది.
ఈ తతంగాన్నంతా వీడియో తీస్తూ ఆమె యజమానురాలు అక్కడే ఉండి చూసింది కానీ, ఆమెను పట్టించుకోలేదు. ఇంతలో ఆమె అక్కడి నుంచి పట్టుతప్పి కళ్లముందే కిందపడిపోయింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మానవహక్కుల సంఘాల ఫిర్యాదుతో అమానవీయంగా ప్రవర్తించిన ఇంటి యజమానురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.