: 'ఇదిగో నాగమణి’ అంటూ భక్తులను నమ్మించే ప్రయత్నం.. పూజారి అరెస్టు!
ప్రజల నమ్మకాలను రకరకాలుగా దోచుకునే మనుషులు మనకు నిత్యం కనిపిస్తూ వుంటారు. అలాగే ఓ పూజారి కూడా ప్రజలను మోసం చేయాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు. ‘నాగమణి’ దొరికిందంటూ భక్తులను నమ్మించే ప్రయత్నం చేసిన ఓ పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్ కి సమీపంలోని గుడిబండిలో ఉన్న చౌడేశ్వరి మాతా ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ‘నాగమణి’ని చూపిస్తానంటూ దర్శనానికి వచ్చిన భక్తులను పూజారి ప్రశాంత్ నమ్మించాడు. ఇందులో భాగంగా ఓ నాగుపామును తీసుకువచ్చి ఆలయంలో ఉంచాడు. దేవతా విగ్రహాలు ఉన్న ఒక వెడల్పాటి పళ్లెంలో తెల్లగా మెరుస్తూ ఒకటి కనపడేటట్టు చేసి, అదే ‘నాగమణి’గా భక్తులను నమ్మించాడు.
దీంతో నాగదేవత తమను దీవించడానికి వచ్చిందంటూ భక్తులు తండోపతండాలుగా ఆ ఆలయానికి వెళ్లారు. అయితే, పూజారి తీరుపై అనుమానం వచ్చిన కొందరు భక్తులు స్థానిక తహసీల్దారు, అటవీ శాఖాధికారులు సహా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు. దీంతో, పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పళ్లెంలో ఆ వెలుగు ఎలా వచ్చిందనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది టార్చిలైట్ వెలుగని చాలామంది భక్తులు చెబుతుండటం గమనార్హం.