: జియోకి షాక్ ఇచ్చే ఆఫర్ తో రంగంలోకి దిగుతున్న కెనడా టెలికాం దిగ్గజం


సరికొత్త ఆఫర్లతో ఇతర టెలికాం సంస్థలను మట్టికరిపించి భారతీయ టెలికాం రంగంలో పాగా వేసిన జియో కూడా ఠారెత్తిపోయే వినూత్న ఆఫర్లతో కెనడా టెలికాం దిగ్గజం డేటావిడ్ భారత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.100 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్ లో రంగప్రవేశం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు పాన్-ఇండియా వర్చ్యువల్‌ నెట్‌ వర్క్ ఆపరేటర్ (వీఎన్ఓ) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.

 మొట్టమొదటి పంజాబీ ఎడ్యుకేషన్ ట్యాబ్లెట్ ప్రారంభోత్సవం సందర్భంగా డేటా విండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తులి మాట్లాడుతూ, ‘‘మరో నెలలోనే లైసెన్స్ వస్తుందని భావిస్తున్నాం. డేటా సర్వీసులే లక్ష్యంగా మొదటి ఆరు నెలలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నాం. భారత్ లో నెలకు 1000-1500 రూపాయల మధ్య ఖర్చు చేయగలిగే వారు మాత్రమే జియో 300 రూపాయల డేటా ప్లాన్‌ ను భరించగలరు. ఇలా ఖర్చు చేయగలిగే వారు దేశంలో 30 కోట్లమందే. మిగిలిన వారు నెలకు 90 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలరు. అటువంటి వారికి జియో ఆఫర్ భారం కానుంది’’ అని తులి తెలిపారు.

 కాబట్టి నెలకు 20 రూపాయలు అంతకంటే తక్కువ ధరకే డేటాను అందించే లక్ష్యంతో డేటా విండ్ రంగంలోకి దిగనుందని ఆయన చెప్పారు. ఈ ప్లాన్ ప్రకారం భారత్ లో సగటు వినియోగదారుడు డేటా కోసం ఏడాదికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడని, అంతకు మించకుండా డేటా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఇది అందుబాటులోకి వస్తే...జియో ఠారెత్తిపోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే డేటా రేట్లపై జియోతో పోటీ ప్రారంభించిన టెలికాం సంస్థలు డేటా విండ్ రంగప్రవేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. 

  • Loading...

More Telugu News