: ఆవులను చంపినా, తరలించినా యావజ్జీవ ఖైదు... కఠినమైన కొత్త చట్టం తెచ్చిన గుజరాత్
గోవధకు పాల్పడేవారిపై నేరం రుజువైతే యావజ్జీవ ఖైదు విధించేలా గుజరాత్ అసెంబ్లీ చట్టాన్ని మార్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనుండగా, ఈ ఉదయం 1954 నాటి గుజరాత్ యానిమల్ ప్రివెన్షన్ యాక్ట్ ను సవరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సవరించిన చట్ట ప్రకారం, ఆవులను తరలించినా, వాటిని చంపినా యావజ్జీవ జైలు శిఖ విధించవచ్చు. దీంతో పాటు ప్రస్తుతమున్న రూ. 25 వేల జరిమానాను రూ. 50 వేలకు పెంచుతూ అసెంబ్లీ చట్ట సవరణకు ఆమోదం పలికింది. కాగా, ఇటీవల గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ, 'గోవు, గంగ, గీత'లను కాపాడేందుకు తాము కట్టుబడి వున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో 2011 నుంచి గోవుల తరలింపు, వధపై నిషేధం అమలవుతుండగా, ఇప్పుడా చట్టం మరింత కఠినమైంది. సమీప భవిష్యత్తులో యూపీ, ఉత్తరాఖండ్ ల్లోనూ ఇదే విధమైన చట్టాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.