: చంద్రబాబు సర్కారును కడిగేసిన కాగ్!


ఆంధ్రప్రదేశ్ జమా ఖర్చులపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఈ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, నిధుల వ్యయాలు అసంతృప్తిగా ఉన్నాయని వెల్లడైంది. 2015-16లో రూ. 36,856 కోట్లను అధికంగా ఖర్చు చేశారని ఆరోపించిన కాగ్, ఎన్నో విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగాయని పేర్కొంది. జీతాల చెల్లింపు కోసమని చెబుతూ, నిబంధనలు పాటించకుండా రూ. 4,650 కోట్లు గంపగుత్తగా కేటాయించారని తెలిపింది.

రాజధాని భూసమీకరణలో భాగంగా భూములు కోల్పోయిన 23,500 కుటుంబాలకు రూ. 2,500 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, 19,075 కుటుంబాలకే పెన్షన్ ఇస్తున్నారని పేర్కొంది. పెన్షన్ లు పంచేందుకు రూ. 70.50 కోట్లు కేటాయించగా, రూ. 55 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని, వేలాది కుటుంబాలకు పెన్షన్ ఇవ్వడం లేదని గుర్తు చేసింది. 2015లో ఏర్పాటు చేసిన నాలుగో ఆర్థిక సంఘం, తన నివేదికను ఇంతవరకూ ఎందుకు సమర్పించలేదని ప్రశ్నలు సంధించింది.

రాష్ట్రంలో 94 శాతం గృహాలకు ఇంకా నీటి మీటర్లను అమర్చలేదని కాగ్ తన నివేదికలో ఆరోపించింది. బొగ్గు సేకరణలో సరైన పర్యవేక్షణ లేని కారణంగా రూ. 98.36 కోట్ల నష్టం ఖజానాకు వాటిల్లిందని తెలిపింది. పట్టిసీమలో అధిక ప్రీమియంతో టెండర్లను అప్పగించడం వల్ల రూ. 109 కోట్ల నష్టం వచ్చిందని, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాకుండానే అధిక ప్రీమియంతో టెండర్లను ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదని తలంటింది. పుష్కర ఎత్తిపోతల కాలువ పనుల్లో కాంట్రాక్టర్లకు రూ. 21 కోట్ల లబ్ధిని చేకూర్చేలా పనుల విలువలను మార్చారని ఆరోపించింది.

మార్కెట్ యార్డుల్లో కనీస మౌలిక సదుపాయల కోసం రైతులు రూ. 466 కోట్లను కమీషన్ గా ఏజంట్లకు చెల్లించారని గుర్తు చేస్తూ, ఇప్పటికీ యార్డుల్లో సరైన వసతులను కల్పించలేదని కాగ్ ఆక్షేపించింది. కాగా, కాగ్ నివేదిక ఎత్తి చూపిన లోపాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News