: పది రూపాయల కోసం పైశాచికం.. బాలుడిని నిర్బంధించి సిగరెట్‌తో వాతలు
సిగరెట్ తెమ్మని పది రూపాయలు ఇస్తే కొనుక్కు తినేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడో తరగతి బాలుడిని అతి కిరాతకంగా హింసించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెస్తవారిపేట మండలంలోని నేకునాంబాదుకు చెందిన మెట్టల కుమారి కుమారుడు వెంకటరావు (8)కి అదే గ్రామానికి చెందిన వాడాల నరేంద్ర (19) సిగరెట్ తెమ్మంటూ రూ.10 ఇచ్చాడు. ఆ డబ్బులతో బాలుడు తినుబండారాలు కొనుక్కుని తినేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన నరేంద్ర బాలుడిని ఇంటికి తీసుకెళ్లి రాత్రంతా బంధించాడు. అంతేకాక సిగరెట్ కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.