: జర్నలిస్టు వస్త్రధారణపై బాంబే హైకోర్టు అభ్యంతరం!
జీన్సు, టీషర్టు ధరించి కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరైన ఓ జాతీయ ఛానెల్ జర్నలిస్ట్ వస్త్రధారణపై బాంబే హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అటువంటి వస్త్రధారణ ‘ముంబయి సంప్రదాయం’ కాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇటీవల మహారాష్ట్రలో వైద్యులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమ్మెను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో సదరు జర్నలిస్టు జీన్స్, టీషర్టుతో కవరేజ్ కోసం కోర్టుకు వెళ్లారు. దీంతో అక్కడి న్యాయమూర్తులు అతడిని చూసి జర్నలిస్టులు అటువంటి వస్త్రాలు ధరించి కోర్టుకు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. కాగా, కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరైనప్పుడు జర్నలిస్టులు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు ఏమీ లేవు. జర్నలిస్టుల వస్త్రధారణపై ఓ హైకోర్టు అభ్యంతరం చెప్పడం ఇదే మొదటిసారి.