: జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమో: చంద్రబాబు చురకలు
తమ ప్రభుత్వమే మొదటిసారి పదవతరగతి పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతి తీసుకొచ్చిందని, ఆ పద్ధతిపై ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కనీస అవగాహన కూడా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే పరీక్షల విధానం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అసలు జంబ్లింగ్ అంటే ఏంటో మీకు తెలుసా? అని ఆయన వైసీపీ సభ్యులను ప్రశ్నించారు.
సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు ఉండాలి కానీ, ఇలా అసత్య ఆరోపణలు చేయడానికి కాదని అన్నారు. జంబ్లింగ్ అంటే ఒక్క స్కూల్లో ఉండే పిల్లల్ని కంప్యూటర్ ద్వారా విభజించి నాలుగైదు స్కూళ్లకు పరీక్షలకు పంపిస్తారని అన్నారు. ఈ ఏడాది ఇన్విజిలేటర్లకు కూడా జంబ్లింగ్ విధానం తీసుకొచ్చామని అన్నారు. ఇంటర్‌లో ప్రాక్టికల్ టెస్టులకు కూడా జంబ్లింగ్ తీసుకొచ్చామని తెలిపారు.