: భార్య, కుమారుడితో వచ్చిన ఎమ్మెల్యే అమిత్ షాకు గుజరాత్ అసెంబ్లీ వద్ద ఘన స్వాగతం!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, గుజరాత్ రాష్ట్ర చట్ట సభ సభ్యుడు కూడా అయిన అమిత్ షా గురువారం గాంధీనగర్ లో అడుగు పెట్టారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు గాను ఆయన గాంధీనగర్ కు చేరుకోగా అసెంబ్లీ వద్ద ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల వరకు అందరూ ఘన స్వాగతం పలికారు. అమిత్ షా గుజరాత్ లోని నరన్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే, ఎమ్మెల్యేగా శాసనసభ సమావేశాలకు అమిత్ షా రెండేళ్ల తర్వాత హాజరవుతున్నారు. చివరి సారిగా ఆయన 2015 మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. అమిత్ షా వెంట, ఆయన భార్య, కుమారుడు సైతం ఉన్నారు. వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితువఘాని పూల మాలలతో ఘనంగా ఆహ్వానం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలకు వ్యూహరచన చేయనున్నారు. ఇందులో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలతో చర్చించనున్నారు. 182 సీట్లలో బీజేపీ కనీసం 150కి తక్కువ కాకుండా గెలుచుకోవాలని అమిత్ షా రాష్ట్ర నాయకులకు లక్ష్యాన్ని విధించారు. యూపీ ఫలితాల మాదిరిగానే గుజరాత్ లోనూ ఘన విజయం సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.