: ఆ వ్యాఖ్యలు మొత్తం ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి చేసినవి కావు: విరాట్ కోహ్లీ
టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు మధ్య మాటల యుద్ధం చెలరేగిన నేపథ్యంలో నిన్న విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఆ దేశ క్రికెటర్లు ఇకపై తనకు మిత్రులు కాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తాను చేసిన ఆ వ్యాఖ్యలపై కోహ్లీ ఈ రోజు స్పందిస్తూ... తాను చేసిన ఆ వ్యాఖ్యలు మొత్తం ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి చేసినవి కావని చెప్పాడు. తనకు ఆస్ట్రేలియా జట్టులో ప్రస్తుతం మిత్రులు తక్కువగా ఉన్నారని కోహ్లీ అన్నాడు. తన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించాడు. తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెటర్ లను అగౌరవ పర్చాలనే ఉద్దేశంతో చేసినవి కాదని చెప్పాడు. ప్రారంభం కానున్న ఐపీఎల్ లో తాను ఆసీస్ ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నానని ఈ సందర్భంగా చెప్పాడు. కోహ్లీ నిన్న చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, మీడియా విమర్శలు గుప్పించింది. కోహ్లీ పొగరుగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు రావడంతో ఆయన మళ్లీ ఇలా స్పందించాడు.