: నేను చచ్చిపోయి 28 రోజులు అయ్యుండేది...!: కదిలించిన ఓ బాధితురాలి వ్యథ!
అగ్రీగోల్డ్ స్కీముల్లో తనకు తెలిసిన వారి నుంచి లక్షలాది రూపాయలు కట్టించిన ఓ బాధిత మహిళ, తన కథను పవన్ కు చెప్పి, ఆయన్ను కదిలించింది. వాస్తవానికి ఈ రోజుకు తాను చనిపోయి 28 రోజులు అయ్యుండేదని, ఇప్పుడిక్కడ ఉన్నానంటే, పలువురు ఇతర బాధితులు చెప్పిన మాటలే కారణమని ఓ మహిళ పేర్కొంది.
ఎనిమిది సంవత్సరాల నాడు తన బంధువు ఒకరు ఈ సంస్థ గురించి గొప్పగా చెబితే, తొలుత తాను పెట్టుబడి పెట్టి, ఆపై ఏజంటుగా మారానని, తన ఊరిలో ఎంతో మందితో డబ్బులు కట్టించానని ఆమె గుర్తు చేసుకుంది. ఆపై సంస్థ పతనమైన తరువాత, డబ్బులు ఇస్తావా? చస్తావా? అంటూ సొంత అన్నదమ్ములే నిలదీశారని, బంధువులంతా ఆస్తులమ్మి డబ్బు కట్టాలని చెబుతుంటే, చచ్చి పోవాలని ఎన్నోసార్లు అనుకున్నానని వాపోయింది. తమ సమస్యపై మాట్లాడి నిలదీయాలని పవన్ కల్యాణ్ ను కోరింది. తాను సొంత ఊరిలో కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఎవరు వచ్చి కొడతారోనన్న భయాందోళన నెలకొందని చెప్పుకొచ్చింది.