: స్టాలిన్ కు ఓటమి భయం పట్టుకుంది... అందుకే అలా డిమాండ్ చేస్తున్నారు!: పన్నీర్ సెల్వం నిప్పులు
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. ఆర్కే నగర్ లో ఓటర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఓటమి భయంతోనే ఆయన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి శశికళకు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. డీఎంకే నేతలే 2జీ, ఎయిర్ మాక్సీస్ లాంటి అతి పెద్ద స్కాములు చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక శశికళ తనను అమ్మ జయలలిత నుంచి దూరం చేసేందుకు 2006 నుంచి చేసిన ప్రయత్నాలే ఆ 90 శాతం రహస్యాలని ఆయన తెలిపారు. అమ్మ అపోలో ఆసుపత్రిలో ఉండగా కనీసం ఆమెను చూడలేకపోయానని పన్నీర్ సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం అమ్మ జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలని లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో చర్చించానని ఆయన తెలిపారు. అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావాలని, లేని పక్షంలో నేతలపై మాత్రమే కాదు, వారి ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయని హెచ్చరించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్కేనగర్ ఓటర్లు మధుసూదనన్ వెంట ఉన్నారని... డీఎంకే అభ్యర్థికి ఓటమి తప్పదని ఆయన తెలిపారు.