: 20 ఏళ్ల తరువాత జతకట్టిన సౌతిండియా స్టార్ నటులు!
తమిళనాడు రాజకీయ ప్రముఖులపై ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'ఇరువర్' సినిమాలో దక్షిణాది ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, మోహన్ లాల్ కలసి నటించిన సంగతి తెలిసిందే. తరువాత వారిద్దరూ ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలు రాలేదు. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్ కలిసి నటించనున్నారు. వీఏ.కుమార్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా పేరు 'ఒడియాన్'.
కేరళలోని పాలక్కాడ్-మలబార్ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ఈ సినిమా నడుస్తుంది. ఆ గిరిజనులకు మనుషులు, జంతువులు.. ఇలా ఏ రూపంలోకైనా మారే అద్భుత శక్తులుంటాయని.. ఇదివరకు ఎవరూ వినని కథనమని డైరెక్టర్ వీఏ శ్రీకుమార్ మీనన్ చెప్పారు. పాలక్కాడ్, థజారక్, పొల్లాచి, వారణాసి, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ చేయనున్నామని చెప్పిన ఆయన, మే 25 నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. నవంబర్ లో 'ఒడియాన్'ను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. మోహన్ లాల్ సరసన మంజు వారియర్ ను ఎంచుకోగా, ప్రకాశ్ రాజ్ తోపాటు ఓ హిందీ నటుడ్ని తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు చిత్రయూనిట్ తెలిపింది.