: భారత్ అంగీకరిస్తే క్రికెట్ ఆడేందుకు సిద్ధం: షహర్యార్ ఖాన్
బీసీసీఐ అంగీకరిస్తే దుబాయ్ లో టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ తో క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరికి తమ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం అంగీకరించగానే తాము పాక్ ప్రభుత్వంతో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటామని ఆయన చెప్పారు.
మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ20లతో పూర్తి స్థాయి సిరీస్ నిర్వహణకు బీసీసీఐ ప్రతిపాదించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే దుబాయ్ లో ఈ టోర్నీని నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, 2009లో శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. పీసీబీ నిర్వహించే పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ను కూడా దుబాయ్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.