: పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన వేద పండితులు!
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ప్రముఖ పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగం విశిష్టతను వివరించారు. హేవళంబి అంటే బంగారు తోరణం అని సంస్కృతంలో అర్థమన్నారు. కనుక ఈ ఏడాది అమరావతి నిర్మాణానికి బంగారు తోరణం కావాలని ఆశిద్దామని చెప్పారు.
‘‘కలియుగం ప్రారంభమై 5118 సంవత్సరాలు అయింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం శుభప్రదం. వినడం అనేది ఒక మంచి లక్షణం. శ్రద్ధగా విని, ఏ ఏ సమయాల్లో ఏ పనిచేస్తే విజయం సాధిస్తామో తెలుసుకుని ఆ విధంగా చేయడం వల్ల విజయం పొందవచ్చు. గోదాన పుణ్యం, మంచి సంతానం, సంపత్తు కలిగి ఉండడం అనే కర్మలు చేయడానికి ఉపకరణంగా ఉంటుంది పంచాంగం.
అటు మూడు తరాలు, ఇటు మూడు తరాలు మొత్తం ఏడు తరాలు తరించే పుణ్య కార్యక్రమం పంచాంగ శ్రవణం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం కరణం ఉంటాయి. పంచాంగం వల్ల రెండు ఉపయోగాలను పండితులు చెప్పారు. నీకు, సమాజానికి మంచి కలిగేవి చేయాలని. నీకు సంబంధించినవి ఇంట్లో, సమాజానికి ఉపయోగపడేవి దేవాలయాలు, రాజప్రసాదంలో చేయాలి’’ అని వివరించారు.