: టాలీవుడ్ నటుడికి నైజీరియన్ల టోకరా.. కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం!
ఫేస్‌బుక్ పరిచయం ఓ టాలీవుడ్ నటుడి కొంపముంచింది. నిండా మునిగిన ఆయన చివరికి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన సినీ నటుడికి ఫేస్‌బుక్ ద్వారా ఫిలిసికా ఇస్సాక్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ముదరడంతో ఇద్దరూ కలిసి తన సినిమాలపై వాట్సాప్ ద్వారా ముచ్చటించుకునేవారు. తాను లండన్‌లో ఉంటున్నట్టు నమ్మించిన ఇస్సాక్ తాను కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని, లండన్ వచ్చి తీసుకోవాల్సిందిగా నటుడికి చెప్పింది. అయితే తనకు లండన్ రావడం వీలుకాదంటూ ఆమెనే భారత్‌కు ఆహ్వానించాడు. దీంతో జనవరి 19న తాను ఇండియాకు వస్తున్నట్టు పేర్కొన్న ఇస్సాక్ తన పాస్‌పోర్ట్, టికెట్స్ కాపీని ఈమెయిల్ చేసింది.
తన ప్లాన్‌లో భాగంగా మరుసటి రోజు నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ తాను ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని, లగేజీ పరిమితికి మించడంతో కస్టమ్స్ అధికారులు రూ.25,500 జరిమానా విధించారని, ఆ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా కోరడంతో అతడు ఆ మొత్తాన్ని పంపించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి నటుడికి ఫోన్‌చేసి తనను కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకుని ఇస్సాక్‌ను విడిచిపెట్టాలంటే మరో రూ.50 వేలు చెల్లించాలని చెప్పడంతో ఢిల్లీకి చెందిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.50వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ హైదరాబాద్ వచ్చేందుకు ఈ రోజు విమానాలు లేకపోవడంతో రేపు వస్తున్నట్టు చెప్పింది. అయితే తర్వాత రోజు లితిక అనే మహిళ నటుడికి ఫోన్ చేసి ఇస్సాక్ లండన్ కరెన్సీతో పట్టుబడిందని, నగదుతో సహా విడిచిపెట్టాలంటే రూ.1.2 లక్షలు చెల్లించాలని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన నటుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్లు నొబేర్త్ ఛుక్వేదో, నిమ్‌మున్ కిమ్‌లను అరెస్టు చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి మంగళవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. అయితే, మోసపోయిన ఆ సినీ నటుడు ఎవరన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.