: మేము మాట్లాడితే...అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా: నాని
ఐఫా అవార్డు ప్రదానోత్సవంలో రానాతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నానని యువనటుడు నాని తెలిపాడు. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లలో హీరోయిన్లు ఉంటే బాగుంటుందని అంటారని, అలా అనుకునే వాళ్లు రానా పక్కన హీరోయిన్ గా తనను ఊహించుకోవచ్చని చమత్కరించాడు. రానా, తాను మంచి స్నేహితులమని, సినీ పరిశ్రమకు వచ్చిన నాటి నుంచే తమ మధ్య మంచి స్నేహం ఉందని చెప్పాడు. తామిద్దరం కలిసి తొలిసారి ఇలా భారీ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం ఆనందంగా ఉందని చెప్పాడు. తన వ్యాఖ్యానం ఎలా ఉందో రేపు అభిమానులే చెబుతారని నాని చెప్పాడు. అందర్నీ అలరిస్తామని తాము భావిస్తున్నామని నాని అన్నాడు. ఐఫా వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ తారలు కనిపిస్తారని, రేపు ఉగాదితో పాటు అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని నాని సూచించాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పాడు.