: ప్రియుడితో కలిసి విషం తాగిన వివాహిత.. తర్వాత 108కు సమాచారం ఇచ్చిన ప్రియుడు!
సంగారెడ్డి రూరల్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, వారే చివరి నిమిషంలో 108కు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. న్యాల్‌కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, తన భర్త యాదయ్యకు చెప్పకుండా అనిల్‌రెడ్డితో కలిసి శిరీష రెండు రోజుల క్రితం సంగారెడ్డికి వచ్చింది.
అక్కడి పోతిరెడ్డిపల్లిలోని ఓ లాడ్జిలో దిగారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది వారిరువురూ నిన్న విషం తాగారు. అయితే, ఇంతలో అనిల్ రెడ్డి ఏమనుకున్నాడో.. 108కు సమాచారం అందించడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. శిరీష, యాదయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె తన భర్తతో కొంత కాలంగా గొడవపడుతోందని పోలీసులు తెలిపారు.