: ఐపీఎల్ కోసం టెస్టును ఎగ్గొట్టిన కోహ్లీ: బ్రాడ్ హాగ్ సంచలన ఆరోపణ
వచ్చే నెలలో జరగనున్న ఐపీఎల్ పోటీలపై ఉన్న మక్కువతోనే, విరాట్ కోహ్లీ నాలుగో టెస్టును ఆడకుండా ఎగ్గొట్టాడని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మెన్ బ్రాడ్ హాగ్ సంచలన విమర్శలు చేశాడు. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీకి కోచ్ గా ఉన్న ఆయన, ఫాక్స్ స్పోర్ట్స్ న్యూస్ తో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనుందని గుర్తు చేస్తూ, ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి తనకేమీ సమస్యలు ఉండరాదనే కోహ్లీ, టెస్టు మ్యాచ్ ఆడలేదని భావిస్తున్నానని చెప్పాడు. ఒకవేళ కోహ్లీ తీవ్ర గాయాలతోనే ఈ మ్యాచ్ కి దూరమైన మాట నిజమే అయితే, మరికొన్ని రోజుల్లో గుజరాత్ లయన్స్ టీమ్ తో జరిగే మ్యాచ్ లోనూ కోహ్లీ ఆడకూడదని హాగ్ అన్నాడు. టెస్టు మ్యాచ్ ని ఆడకుండా, ఆపై వారంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటే, అది చాలా దరిద్రంగా ఉంటుందని అభివర్ణించాడు. ఎంతో విలువైన ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ని గెలుచుకునేందుకు కోహ్లీ కృషి చేసి వుండాల్సిందని చెప్పాడు.