: చెవిరెడ్డి అరెస్ట్... తరలిస్తుండగా తప్పించుకుని పరుగు!
వైకాపా శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్ అమరావతి అసెంబ్లీ గేటు వద్ద నాటకీయ పరిణామాలను తలపించి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్టీయే అధికారిపై దాడి చేసిన బొండా ఉమ, కేశినేని నానిలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, అసెంబ్లీ ఎదుట బైఠాయించిన చెవిరెడ్డిని, మార్షల్స్ సాయంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సులోకి ఎక్కించి, అక్కడి నుంచి తరలిస్తున్న వేళ, వైకాపా సభ్యులు బస్సును అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో బస్సులో నుంచి కిందకు దూకిన చెవిరెడ్డి, అసెంబ్లీలోకి వెళ్లేందుకు పరుగు తీయగా, మరోమారు మార్షల్స్ ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్షల్స్, వైసీపీ సభ్యుల మధ్య పెనుగులాట జరిగింది. అధికార తెలుగుదేశం తమపై దౌర్జన్యానికి దిగుతోందని ఈ సందర్భంగా వైకాపా ఆరోపించింది.