: టాప్ కమెడియన్ కపిల్ శర్మపై ఎయిర్ ఇండియా విచారణ ప్రారంభం!
విమానాలలో అభ్యంతరకరంగా ప్రవర్తించే ప్రయాణికులపై భారత విమానయాన సంస్థలు కన్నెర్ర చేస్తున్నాయి. వారు వీవీఐపీలైనా, సెలబ్రిటీలు అయినా డోంట్ కేర్ అంటున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు ఎయిరిండియా విమానంలో వచ్చాడు ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ. ఈ సందర్భంగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న కపిల్... ఫుల్లుగా మద్యం తాగి, గట్టిగా మాట్లాడుతూ, తన బృందంతో కలసి నానా హంగామా చేశాడు. ఆయన ప్రవర్తనతో తోటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. గొడవ చేయవద్దంటూ కేబిన్ క్రూ సిబ్బంది సూచించి, విమానంలో పెద్ద వయసు వారు కూడా ఉన్నారని... వారికి ఇబ్బంది కలిగించవద్దని కపిల్ కు చెప్పగా... సారీ చెప్పి సైలెంట్ అయిపోయాడట. కానీ, కాసేపటి తర్వాత మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. దీంతో, పైలట్ వచ్చి కపిల్ శర్మకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో, కపిల్ ఊరుకుండిపోయాడట.
కపిల్ శర్మ ప్రవర్తన పట్ల ఎయిరిండియా యాజమాన్యం సీరియస్ అయింది. అతడికి తీవ్రమైన హెచ్చరికలు పంపాలని నిర్ణయించింది. అంతేకాదు, కపిల్ పై ఎయిరిండియా చీఫ్ అశ్వనీ లొహానీ విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో కపిల్ కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించనున్నారు.