: మీకు, జగన్‌కు తేడా ఏంటి?.. కేశినేని నాని, బొండా ఉమ, బుద్ధా వెంకన్నపై చంద్రబాబు ఫైర్
విజయవాడలో రవాణాశాఖ కమిషనర్‌పై చిందులు తొక్కిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైరయ్యారు. ఆర్టీఏ కార్యాలయంలో శనివారం టీడీపీ నేతలు వీరంగమేసిన ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన చంద్రబాబు వారిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు టీడీపీ నేతలదే తప్పని నిర్ధారించుకుని చీవాట్లు పెట్టినట్టు సమాచారం.
‘‘ఐపీఎస్ అధికారి గన్‌మెన్‌ను తోయడమేంటి?.. మీకు జగన్‌కు ఏమైనా తేడా ఉందా?’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘‘అధికారులపై విరుచుకుపడుతున్న జగన్‌ను మనం తిడుతున్నప్పుడు, మనం చేసింది ఏమిటి?’’ అని చంద్రబాబు నిలదీశారు. అధికారులతో ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలి తప్ప ఇలా గొడవకు దిగడం సరికాదన్నారు. ఏది ఏమైనా మీరు వ్యవహరించిన తీరు సరికాదని, వెంటనే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి ఆయనకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అధికారంలో ఉన్నవారు అరిటాకుల్లాంటి వారని, తప్పు ఎవరిదైనా కాస్త తగ్గి ఉండడమే మేలని చంద్రబాబు హితవు పలికారు.