: మహానటి సావిత్రిది తమిళనాడు అనుకున్నా.. సావిత్రి జీవిత సాఫల్య అవార్డు వేడుకలో సుహాసిని


మహానటి సావిత్రిది ఇన్నాళ్లూ తమిళనాడు అనే అనుకున్నానని, కానీ ఇప్పుడు తనది గుంటూరు జిల్లా అని తెలిసిందని ప్రముఖ నటి సుహాసిని పేర్కొన్నారు. గంటూరులోని నాజ్‌ సెంటర్‌ ఐలండ్‌లో కళాదర్బార్ అమరావతి సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చేసిన ఏడడుగుల సావిత్రి కాంస్య విగ్రహాన్ని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం సుహాసినికి మహానటి సావిత్రి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.

ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ సావిత్రి మంచితనానికి మారుపేరు అని కొనియాడారు. ఆమె నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు. ఇన్నాళ్లూ సావిత్రి జన్మస్థలం తమిళనాడు అని అపోహపడ్డానని, తనది గుంటూరు జిల్లా అని ఇప్పుడే తెలిసిందన్నారు. స్పీకర్ కోడెల మాట్లాడుతూ సావిత్రి నటించిన 85 తెలుగు సినిమాల్లో 80 సినిమాలు చూసినట్టు చెప్పారు. నిండైన తెలుగుదనానికి సావిత్రి నిదర్శనమన్నారు. సావిత్రి దయాగుణం అందరికీ ఆదర్శమని కొనియాడారు. అటువంటి వ్యక్తి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం చంద్రునికో నూలుపోగు వంటిదని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, అల్లుడు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News