: ఏడుకొండలవాడి వైభవం నేడే.. రాత్రి 9 గంటలకు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్లో ప్రసారం
కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న తిరుమల వెంకన్న వైభవంపై నేషనల్ జియోగ్రాఫిక్ చానల్(ఎన్జీసీ) రూపొందించిన డాక్యుమెంటరీ నేటి (సోమవారం) రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ‘మెగా కిచెన్స్’ కార్యక్రమంలో భాగంగా తిరుమల కొండపై జరుగుతున్న నిత్యాన్నదానాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన చానల్ ప్రతినిధులు దేవదేవుని వైభవాన్ని చూసి ముగ్ధులై ఏకంగా డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం విశేషం. ‘ఇన్సైడ్ తిరుమల తిరుపతి’ పేరుతో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించింది. కొండపై జరుగుతున్న వేడుకల వైభవం, ఆలయ ప్రాశస్త్యం, భక్తుల మనోభావాల గురించి చెబుతూ మొత్తం ఆలయంపై డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిని వీక్షించేవారికి శ్రీవారిని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలిగేలా 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించింది. డాక్యుమెంటరీ ప్రసారం సమయంలో విరామం లేకుండా (బ్రేక్ ఫ్రీ) ప్రసారం చేయాలని ఎన్జీసీ నిర్ణయించింది.