: ప్రేమించలేదన్న కక్షతో... యువతి వ్యక్తిగత ఫొటోలను ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేస్తూ వేధించిన యువకుడు.. అరెస్ట్


తనను ప్రేమించాలని వేధిస్తూ ఓ యువతి వ్య‌క్తిగ‌త‌ ఫొటోల‌ను ఆన్‌లైన్‌లో పెడుతున్న ఓ యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్ శివారులోని రాచ‌కొండ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. బాధిత యువ‌తి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ప‌నిచేసిన సమయంలో ఆమె సహోద్యోగి అయిన బి.దినేశ్‌ కుమార్‌ ఆమెతో పరిచయం చేసుకొని ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే, ఆమె అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమెకు తెలియకుండా ఆమె సెల్‌ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్‌ నంబర్లు తీసుకొని బెదిరించాడు.

మ‌రింత రెచ్చిపోయిన‌ దినేశ్‌.. తనను ప్రేమించలేద‌న్న కోపంతో ఆ వ్యక్తిగత ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు మెయిల్ ద్వారా పంపించాడు. అంతేగాక‌, ఫేస్‌బుక్‌లో ఖాతానుంచి కూడా ఆ ఫొటోల‌ను వారికి పంపించాడు. ఇలా, అత‌డి నుంచి వేధింపులు అధికం కావ‌డంతో ఆమె త‌న ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయిన‌ప్ప‌టికీ అత‌డి నుంచి వేధింపులు అధికం కావ‌డంతో రాచకొండ సైబర్‌ పోలీసులను ఆ యువ‌తి ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు హిమాయత్‌నగర్‌లో అదుపులోకి తీసుకుని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News