: వెంటనే తట్టా, బుట్ట సర్దుకుంటారా.. లేక చంపేయమంటారా?.. మహారాష్ట్రలో ఏపీ కూలీలను చితకబాదిన స్థానికులు
బతుకుదెరువు కోసం మహారాష్ట్ర వెళ్లిన ఆంద్రప్రదేశ్ కూలీలపై దాడి జరిగింది. వారి వల్ల తమ ఉపాధికి గండిపడుతోందని ఆరోపిస్తూ స్థానికులు వారిని చితకబాదారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరించారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వందలాదిమంది కూలీలు పనుల కోసం మహారాష్ట్రలోని పాల్గరు జిల్లాకు వలస వెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీల వల్ల తమకు ఉపాధి లేకుండా పోతోందని అక్కడి స్థానికులు గత కొంతకాలంగా గొడవ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వలస కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి చేరుకున్న స్థానికులు కర్రలు, రాడ్లతో వారిపై దాడి చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూలీలు నివసించే విరార్ వెస్ట్ (థానే జిల్లా పరిధి) ప్రాంతానికి చేరుకుని మరోమారు దాడి చేశారు. వారి దాడిలో పదిమందికిపైగా ఏపీ కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.