: ట్రంప్ కు షాక్... హెల్త్ కేర్ పాలసీపై ఓటింగ్ వాయిదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రిపబ్లికన్లు షాకిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒబామా హెల్త్ కేర్ స్థానంలో కొత్త హెల్త్ పాలసీని ప్రవేశపెట్టేందుకు ట్రంప్ ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ ఓటింగ్ కు సొంత పార్టీ మద్దతు లభించలేదు. దీంతో ఈ పాలసీకి సంబంధించి ఓటింగ్ ను నేటికి వాయిదా వేశారు. నేడు కూడా దీనికి మద్దతు లభించని పక్షంలో సోమవారానికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
దీంతో ట్రంప్ రిపబ్లికన్ సభ్యులకు అల్టిమేటం ఇచ్చారు. దీనిపై వైట్ హౌస్ బడ్జెట్ డైరెక్టర్ మిక్ ముల్వానే మాట్లాడుతూ, అమెరికన్ కాంగ్రెస్ లో ఈ బిల్లు ఆమోదం పొందకపోతే, ఈ బిల్లును అమలు చేసేందుకు ట్రంప్ ఇతర మార్గాల్లో వెళ్తారని హెచ్చరించారు. ఒబామా హెల్త్ కేర్ పాలసీ స్థానంలో వేరే పథకం ప్రవేశపెట్టేందుకు రిపబ్లికన్లంతా మద్దతివ్వాలని ట్రంప్ రిపబ్లికన్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.