: ఓటమిని తట్టుకోలేకపోయాడు... కంప్యూటర్ లో తలదూర్చేశాడు!
కంప్యూటర్ లో తల ఎలా దూర్చేశాడన్న అనుమానం వచ్చిందా? అయితే ఇది చదవండి, మీకే తెలుస్తుంది.... చైనాలో ఆన్ లైన్ గేమింగ్ కి ఆదరణ ఎక్కువ. పట్టణాల్లో యువత ఆన్ లైన్ గేమింగ్ లో పడి ఊహించని పనులు చేయడం, బానిసలుగా మారి వింతగా ప్రవర్తించడం అక్కడ సాధారణమే. ఈ క్రమంలో లాంఝూ నగరంలోని ఓ ఇంటర్ నెట్ సెంటర్లో ఒక యువకుడు సీరియస్ గా 'లీగ్ ఆఫ్ లెజెండ్స్' గేమ్ ఆడాడు. స్టేజ్ లు దాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇంతలో ఊహించని విధంగా అతను ఓటమిపాలయ్యాడు. దీంతో ఓటమి భారాన్ని తట్టుకోలేకపోయాడు. అంతే తీవ్ర ఆగ్రహంతో తలను స్క్రీన్ కేసి బాదుకున్నాడు. ఎంత వేగంగా బాదుకున్నాడో కానీ... ఆ వేగానికి అతని తల కంప్యూటర్ స్క్రీన్ లోపలి నుంచి అవతలికి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో ఇంటర్నెట్ సెంటర్ యాజమాన్యం వేగంగా స్పందించి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, అంబులెన్స్ ను పిలిపించి తలను బయటకు తీశారు. దీంతో ఆయన ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో ప్రసారం కావడంతో పలువురు దీనిపై మండిపడుతున్నారు. ఆటకోసం ఇలా చేయడమేంటని మండిపడుతున్నారు.