: వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్టుంది: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్కాములు, స్కీముల్లో తలమునకలైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసనమండలిలో ఈ రోజు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగిన సందర్భంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ, కుంభకోణాలకు పాల్పడింది కాంగ్రెస్ నేతలే అని అన్నారు. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో కూర్చొని గడ్డాలు పెంచుకుంటే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.