: ఆ ఎంపీ అందరి ముందు తీవ్రంగా అవమానించారు .. నా కళ్ల జోడు పగిలిపోయింది: ఎయిర్ ఇండియా అధికారి ఆవేదన
మన ఎంపీల ప్రవర్తన, సంస్కృతి ఇదే విధంగా ఉంటే ఇక మన దేశాన్ని ఆ దేవుడే రక్షించాలని శివసేన పార్టీ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న ఎయిర్ ఇండియా బాధిత అధికారి సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గైక్వాడ్ చాలా అనుచితంగా ప్రవర్తించారని, అందరి ముందు తనను తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడ్డారని, తన కళ్ల జోడు పగిలిపోయిందని ఆయన వాపోయారు.
పుణె-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సీటు విషయమై ఎంపీ తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎంపీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుకుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందిస్తూ, అధికారులపై భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదని, ఏ పార్టీ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. ఇదే విషయమై శివసేన పార్టీ నేత మనీషా కయండె స్పందిస్తూ, ఇలాంటి ఘటనలను తమ పార్టీ సహించదని అన్నారు.