: రుజువు చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలంటే పారిపోయాడు!: జగన్‌పై ప్రత్తిపాటి విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు... మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారి వ్యాఖ్యలను ప్రత్తిపాటి సభలోనే తిప్పికొట్టగా.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి స్పందించారు. గత బడ్జెట్ సమావేశాల్లోనూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఇటువంటి ఆరోపణలే చేశారని, అయితే ఆ ఆరోపణలు అసత్యమని చెప్పి, అందుకు ఆధారాలు కూడా చూపించానని చెప్పారు. తాము ఆ భూములపై 2014లోనే ఒప్పందం చేసుకున్నామని, అప్పటికి అగ్రిగోల్డ్‌పై కేసు లేదని వ్యాఖ్యానించారు.
అగ్రిగోల్డ్‌కి, తమ భూమికి ఎటువంటి సంబంధం లేదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. తనపై సభలో చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరానని, ఆరోపణలపై సభా సంఘం వేయమన్నానని చెప్పారు. ప్రభుత్వం న్యాయ విచారణకు కూడా ఒప్పుకుందని, అయితే, తన సవాలు స్వీకరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదని అన్నారు. రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాలు చేస్తే జగన్ పారిపోయాడని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు.